: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డితే జీవిత కాల నిషేధం విధించాలి: అలిస్ట‌ర్ కుక్‌

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టెస్టుల్లో ప‌దివేల ప‌రుగులు సాధించిన క్రికెటర్ గా ఇటీవ‌లే ఘ‌న‌త సాధించిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని రుజువైతే వారిని శాశ్వ‌తంగా క్రికెట్‌కి దూరం చేసేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు. క్రికెటర్లు నిజాయ‌తీతో క్రికెట్‌ను కొన‌సాగించాల‌ని, మ్యాచ్ ఫిక్సింగ్ పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షిస్తేనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే తాను ఈ అంశంపై చేస్తోన్న వ్యాఖ్య‌లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో ఐదేళ్ల నిషేధానికి గురైన మొహ్మద్ ఆమిర్ మ‌ళ్లీ క్రికెట్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తోన్న‌ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న‌వి కాద‌ని అలిస్ట‌ర్ కుక్‌ వివరణ ఇచ్చాడు. మొహ్మద్ ఆమిర్ తో త‌మ జ‌ట్టు స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూనే మైదానంలో పోరాడుతుంద‌ని ఆయ‌న అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ లో ప‌ట్టుబ‌డితే ఎంత‌టి ఆట‌గాడికైనా క‌ఠిన శిక్ష విధించాల్సిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు.

More Telugu News