: ఈ దఫా మోదీ అమెరికా పర్యటనలో ఒక్క సెల్ఫీ కూడా లేదు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లినా... సెల్ఫీల జోరు తప్పనిసరి. మోదీని చూసేందుకు వచ్చే వారు తమ చేతిలోని సెల్ ఫోన్ తో మోదీతో తాము కలిసి ఉన్న దృశ్యాన్ని క్లిక్ మనిపిస్తున్న వైనం నిత్యం మనం చూస్తున్నదే. సెల్ఫీలంటే అమితంగా ఇష్టపడే మోదీ కూడా తనతో సెల్ఫీ తీసుకోవాలని ఆశించే ఏ ఒక్కరిని కూడా నిలువరించలేదు. అయితే నిన్నటి మోదీ అమెరికా పర్యటనలో ఒక్క సెల్ఫీ కూడా లేదు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ... ఆ దేశ చట్టసభ సభ్యులను ఆకట్టుకున్నారు. మోదీ ప్రసంగానికి ముగ్ధులైన అమెరికా పార్లమెంటు సభ్యులు హర్షధ్వానాలు తెలిపారు. ప్రసంగం పూర్తి కాగానే మోదీతో కరచాలనాలకు, ఆటోగ్రాఫ్ లకు వారు ఎగబడ్డారు. అయితే ఒక్కరు కూడా మోదీతో సెల్ఫీ దిగలేదు. ఎందుకంటే, సభకు వచ్చిన విదేశీ అధినేతను సెల్ఫీలతో ఇబ్బందుల పాలు చేయొద్దని ఆ దేశ చట్టసభ ప్రోటోకాల్ చీఫ్ ఎలిజబెత్ హెంగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్... నో సెల్ఫీస్’’ అంటూ ఆమె జారీ చేసిన ఆదేశాలతోనే అమెరికా పార్లమెంటేరియన్లు మోదీతో సెల్ఫీలకు సాహసించలేదు.

More Telugu News