: 'ఉడ్తా పంజాబ్'పై ఆరోపణలపై ఒక్కటైన బాలీవుడ్

'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం విషయంలో చిత్ర దర్శక నిర్మాతలకు బాలీవుడ్ అండగా నిలిచింది. ఈ సినిమాలో 'పంజాబ్' అన్న పదం వాడవద్దంటూ సెన్సార్ బోర్డు మొత్తం 80 కట్ లు చెప్పింది. దీంతో సినిమా పేరే 'ఉడ్తా పంజాబ్' అని, తాము ఏ రాజకీయ పార్టీకో లేదా, నేతకో వ్యతిరేకంగా ఈ సినిమాను తీయలేదని, పంజాబ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాము సినిమా తీశామని దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహలానీ ఈ సినిమాను ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారని దర్శకుడు ఆరోపించారు. దీనిపై స్పందించిన పహ్లాజ్... అనురాగ్ కశ్యప్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నిధులు (లంచం) తీసుకుని ఈ సినిమా రూపొందించారని ఆరోపించారు. దీనిపై బాలీవుడ్ మండిపడుతోంది. సినీ పరిశ్రమను పహ్లాజ్ ఆవమానించారని వారు పేర్కొంటున్నారు. ఆయనను సెన్సార్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కేంద్రానికి సూచించారు. మనదేశం సౌదీ అరేబియాలా తయారు కాకూడదని ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ ఆకాంక్షించారు. సమాజంలో చోటుచేసుకుంటున్న సంఘటనలనే ఈ సినిమాలో చూపించారని, ఇవేవీ ఊహాజనితం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా హీరో షాహిద్ కపూర్ మాట్లాడుతూ, ఇందులోని సందేశం అందరికీ చేరేలా సహకరించాలని కోరారు.

More Telugu News