: గంట విమాన ప్రయాణానికి రూ. 2,500 మాత్రమే...త్వరలో కొత్త విధానం!

ఇండియాలో ఎయిర్ ట్రావెల్ మాధ్యమంలో రీజనల్ కనెక్టివిటీని పెంచడానికి పౌరవిమానయాన శాఖ కీలక చర్యలు సిఫార్సు చేసింది. ఇందులో భాగంగా, గంట వ్యవధిలో టేకాఫ్, ల్యాండింగ్ కు అవకాశమున్న నగరాల మధ్య విమాన ప్రయాణ టికెట్ గరిష్ఠంగా రూ. 2,500 దాటకుండా చూడాలని భావిస్తున్నట్టు ఆ శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ దూబే వెల్లడించారు. "మరో రెండు వారాల్లో ఈ విధానం బయటకు వస్తుంది. ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేశాము. నేడు క్యాబినెట్ ముందు ఉంచుతాం. మొత్తం 22 సిఫార్సులు ఉన్నాయి. వీటిపై ఏకాభిప్రాయం కుదిరితే దేశీయ ఎయిర్ లైన్స్ సంస్థలకు మేలు కలుగుతుంది" అని ఆయన అన్నారు. కాగా, వివాదాస్పద 5/20 రూల్ (కనీసం 20 విమాన సర్వీసులతో ఐదేళ్లు సేవలందిస్తేనే విదేశీ రూట్లలో సర్వీసులు తిప్పేందుకు అనుమతి)ను మార్చాలని ఈ ముసాయిదాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని 0/20 (కనీసం 20 విమానాలుంటే, విదేశీ సేవలకు అనుమతి)గా మార్చాలని కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ పాలసీని క్యాబినెట్ ఓకే చేస్తే, కొత్తగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన ఎయిర్ ఆసియా, విస్తారా తదితర సంస్థలకు లబ్ధి చేకూరుతుంది.

More Telugu News