: మోదీతో 'స్నేహబంధం' వదిలేసిన ముడిచమురు... ఇక కష్టకాలమే!

తన అధ్యక్ష పీఠాన్ని త్వరలో వదలనున్న బరాక్ ఒబామాతో పాటు భారత్ ను రెండేళ్లుగా ఏలుతున్న నరేంద్ర మోదీకి ఓ మంచి మిత్రుడు (క్రూడ్ ఆయిల్) దూరమవుతున్నాడు. వీరిద్దరి పాలనలో గణనీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు తిరిగి పెరగడం ప్రారంభం కావడం ఒబామాకు కాదుగానీ, మోదీకి మాత్రం ఇబ్బందులు కలిగించక తప్పదని నిపుణులు వ్యాఖ్యానించారు. వాస్తవానికి నరేంద్ర మోదీ మే 26, 2014న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో క్రూడాయిల్ ధర 105 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇప్పుడది 50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒకరకంగా ఇది శుభవార్తేగా అనుకొంటున్నారా? అక్కడే విషయం ఉంది. మోదీ ప్రధానిగా ఉన్న తొలి 18 నెలల కాలంలో క్రూడాయిల్ ధర 13 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయి 27.10 డాలర్లకు దిగజారింది. ఆ సమయంలో ఇండియాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 30కి అటూఇటుగా ఉండాలి. కానీ ప్రభుత్వాల సుంకాల బాదుడు పుణ్యమాని ఏనాడూ రూ. 50 కన్నా కిందకు దిగిరాలేదు. కేవలం పెట్రోలుపై సుంకాల ద్వారానే, మోదీ ప్రభుత్వం ఖజానాకు రూ. లక్ష కోట్లకు పైగా జమ చేసుకుంది. ఇక ఇప్పుడు తిరిగి క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో, అంతే స్థాయిలో ఓఎంసీలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) పెట్రోలు, డీజిల్ ధరలను సవరించుకుంటూ వెళుతున్నారు. ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం ప్రజలకు దగ్గర కానీయకుండా ఎక్సైజ్ సుంకాలను వడ్డిస్తూ పోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ధరలు పెరుగుతున్న వేళ, పెంచిన సుంకాలను తగ్గించేందుకు ఏ కోశానా ప్రయత్నించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. సుంకాలను పెంచిన కారణంగా వచ్చిన నిధులను మౌలిక వసతులు, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు ఖర్చుచేసిన మోదీ సర్కారు పరిస్థితి ఇప్పుడు 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి' చందంలా ఉంది. సుంకాలను తగ్గిస్తే, ఖజానాకు వచ్చే నిధులు ఆగుతాయి. అలాగే ఉంచితే, వాహనదారులు, రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి వ్యతిరేకత పెరుగుతుంది. పెట్రోలు ధరలు పెరిగినప్పుడల్లా, సరకు రవాణా చార్జీలు పెరిగి, పప్పు, ఉప్పు, చింతపండు నుంచి కూరగాయలు, గృహోపకరణాల వరకూ ధరలను సవరించాల్సి వస్తుంది. ఇక రెండేళ్ల పరిపాలన పూర్తయి, ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్న వేళ, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు మోదీకి తీవ్ర ఇబ్బందులను ఎదురు చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News