: మీడియాపై అంతెత్తున ఎగిరిన ట్రంప్...తన ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆరోపణ!

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీడియాపై మండిపడ్డారు. మీడియా అగౌరవంగా వ్యవహరిస్తోందని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మీడియా కథనాలు ప్రచారం అవుతున్నాయని ట్రంప్ ఫైరయ్యారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లోని జర్నలిస్టులు రోజూ తనను అపఖ్యాతి పాలు చేసే కథనాలు అల్లుతున్నారని వాపోయారు. తనపట్ల మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించిన 69 ఏళ్ల ట్రంప్.. రోజూ వస్తోన్న తప్పుడు కథనాల గురించి అమెరికా ప్రజలకు తెలుసని అన్నారు. వృద్ధుల సంక్షేమ నిధి కోసం ఒక్కరాత్రిలో తాను 6 మిలియన్ డాలర్లను సేకరించినట్లు, ఈ ఏడాది ప్రారంభంలో ఐయోవాలో మొదలైన నిధుల సేకరణ విజయవంతం అయినట్లు ట్రంప్ ప్రకటించగా, దీనిపై అమెరికా మీడియా పలు విమర్శనాత్మక కథనాలు ప్రచారం చేసింది. దీంతో మండిపడ్డ ట్రంప్, మీడియా ఇదే ధోరణిలో ముందుకు వెళితే తన దాడి కూడా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఇక మీడియాపై మండిపడిన ట్రంప్ తీరును వైట్ హౌస్ కరస్పాండెంట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) ఖండించింది.

More Telugu News