: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను తగ్గించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు!

భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ ఉన్న వేళ, అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన గంటన్నరకే సూచికలు నష్టాల్లోకి జారిపోయాయి. ఆపై మధ్యాహ్నం 2 గంటల తరువాత కొంత మేరకు కొనుగోళ్లు కనిపించినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను విక్రయించినట్టు బీఎస్ఈ గణాంకాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 57.64 పాయింట్లు పడిపోయి 0.22 శాతం నష్టంతో 26,667.96 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 18.40 పాయింట్లు పడిపోయి 0.22 శాతం నష్టంతో 8,160.10 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.18 శాతం, స్మాల్ కాప్ 0.14 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఎస్బీఐ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, సన్ ఫార్మా, ఇన్ ఫ్రాటెల్, టీసీఎస్, బీపీసీఎల్, గెయిల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,732 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 998 కంపెనీలు లాభాలను, 1,568 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 99,57,641 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 99,29,603 కోట్లకు తగ్గింది.

More Telugu News