: సచిన్ రికార్డు బద్దలు!... టెస్టుల్లో 10 వేల రన్స్ చేసిన ‘బుడ్డోడు’గా కుక్!

క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ రమేశ్ టెండూల్కర్ పేరిట నమోదైన రికార్డులను బద్దలు కొట్టడం దాదాపుగా దుస్సాధ్యమేనన్న వాదనలు క్రమంగా పటాపంచలవుతున్నాయి. రెండున్నర దశాబ్దాల పాటు టీమిండియా జట్టులో కొనసాగిన టెండూల్కర్ లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. అయితే అతడి పేరిట నమోదైన రికార్డులను బద్దలు కొట్టడం తమకు సాధ్యమేనని కుర్రకారు క్రికెటర్లు రుజువు చేస్తున్నారు. బ్యాటును ఝుళిపించడంలో సత్తా ఉన్న క్రికెటర్ గా పేరున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మన్, ఆ దేశ టెస్టు జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్... సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును నిన్న బద్దలు కొట్టాడు. పిన్న వయసులో టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా సచిన్ పేరిట ఉన్న రికార్డును కుక్ చెరిపేసి తన పేరిట లిఖించుకున్నాడు. దుర్హామ్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో 47 పరుగులు చేసిన కుక్... 31 ఏళ్ల 158 రోజుల వయసులో పది వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. 2005లో 31 ఏళ్ల 326 రోజుల వయసులో ఉండగా కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఈ మార్కును చేరుకున్నాడు. తాజాగా అతడి కంటే చిన్న వయసులోనే కుక్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 158 టెస్టుల్లోనే కుక్ ఈ మార్కును చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లలో కుక్ 12వ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

More Telugu News