: సహారా, అగ్రిగోల్డ్ వంటి సంస్థలకు అడ్డుకట్టగా కొత్త చట్టాన్ని తేనున్న మోదీ సర్కారు!

పేద ప్రజలకు ఆకర్షణీయ స్కీములను ఆశగా చూపించి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న వారి ఆట కట్టించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చేలా కూడా ఈ చట్టం ఉపకరిస్తుందని సమాచారం. చట్టంలోని లొసుగులకు అడ్డుకట్ట వేసేలా పటిష్ఠంగా దీన్ని రూపొందించాలని న్యాయ నిపుణులకు మోదీ స్వయంగా సూచించినట్టు తెలుస్తోంది. చట్టాలను అతిక్రమించి, పిరమిడ్ స్కీములను నిర్వహిస్తూ సహారా ఇండియా, అగ్రిగోల్డ్ వంటి సంస్థలు ప్రజల నుంచి వేల కోట్లను వసూలు చేసి వాటిని తిరిగి చెల్లించకుండా మోసం చేస్తున్న నేపథ్యంలో, ఈ తరహా చట్టం అవసరమని ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నిషికాంత్ దూబే అన్నారు. భవిష్యత్తులో సహారా వంటి స్కాములు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. జూలైలో నూతన బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని, దీంతో బలహీనంగా ఉన్న క్రెడిట్ ఆ-అపరేటివ్ సంస్థలపై కఠిన నిబంధనలు అమలవుతాయని తెలిపారు. కాగా, ఈ తరహా సేవింగ్స్ గ్రూపులపై అధికారుల నిఘా తక్కువగా ఉందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఎవరిపైనైనా విచారణ ప్రారంభిస్తే, వారి నుంచి లబ్ధి పొందుతున్న రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వచ్చేవని వివరించారు. అందుబాటులోని గణాంకాల మేరకు ఈ తరహా ఆకర్షణీయ స్కీముల్లో పెట్టుబడులు పెట్టిన 6 కోట్ల మంది సుమారు రూ. 66 వేల కోట్లను నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇక సహారా కుంభకోణం వెలుగులోకి వచ్చి 2014లో ఆ సంస్థ చీఫ్ సుబ్రతారాయ్ జైలుకు వెళ్లిన తరువాత, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) డిపాజిట్ల రూపంలో డబ్బు వసూలు చేస్తున్న 273 సంస్థలకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సంస్థలేవీ డిపాజిట్లు వసూలు చేయరాదని, ఆస్తులను విక్రయించరాదనీ ఆదేశించింది. వీటిల్లో 144 కంపెనీలను తక్షణమే డిపాజిట్ దారులకు చెల్లింపులు జరపాలని ఉత్తర్వులు వెలువరించింది.

More Telugu News