: అప్పు కావాలా? అయితే, ఫేస్ బుక్ లో ఫేమస్ కావాలట!

మీకు స్నేహితులు, సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉన్నాయా? ఫేస్ బుక్, ట్విట్టర్, లింకెడిన్ వంటి సామాజిక మాధ్యమాల్లో మీరు పెడుతున్న పోస్టులకు మంచి స్పందన వస్తోందా? అయితే మీరు సంఘంలో బలమైన వ్యక్తి కిందే లెక్క. మీకు రుణలభ్యత ఇతరులతో పోలిస్తే మరింత సులువవుతుంది. ఇప్పటికే కొన్ని ఏజన్సీలు రుణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారి సామాజిక మాధ్యమ ఖాతాలను ఫాలో అవుతూ వారెలాంటి పోస్టులు పెడుతుంటారు? ఎలాంటి స్పందన వస్తోందన్న విషయాలను చూసి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతేకాదు, రుణ దరఖాస్తును వేగంగా ప్రాసెస్ చేయడంలో, ఆపై వడ్డీ రేటు బేరసారాల్లోనూ సామాజిక మాధ్యమ మిత్రులు సహకరిస్తున్నారట. ఫేస్ బుక్ లో మీరు పెట్టే హాలిడే చిత్రాలను ఆదాయపు పన్ను శాఖతో పాటు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు ఫాలో అవుతుంటాయి కూడా. మీ 'సోషల్ వర్త్' ఎలా ఉందన్న విషయంపై ఆధారపడి డిఫాల్టింగ్ రిస్క్ (ఎగవేత ప్రమాదం) రేటింగ్ మారుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. "ముఖ్యంగా ఎలాంటి క్రెడిట్ డేటా అందుబాటులో లేని తొలిసారి రుణ గ్రహీతలకు సామాజిక మాధ్యమాలు ప్రత్యామ్నాయ సమాచార కేంద్రాలుగా ఉపకరిస్తున్నాయి. వీటిని రుణమివ్వాలని చూసే బ్యాంకులు నిశితంగా గమనించిన మీదటే రుణం మంజూరు చేస్తున్నాయి. రుణ మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ)లు సైతం ప్రత్యామ్నాయ సమాచారాన్ని పరిశీలిస్తున్నాయి" అని క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పుంజా వెల్లడించారు. తమ కంపెనీ తొలిసారి రుణ గ్రహీతల క్రెడిట్ అనాలిసిస్ సేవలను అందిస్తున్నామని, ఓ ప్రభుత్వ, మరో ప్రైవేటు బ్యాంకుకు తాము సేవలందిస్తున్నట్టు ఆయన తెలిపారు. 'ఎర్లీ శాలరీ' పేరిట ప్రారంభమైన పుణె స్టార్టప్ కు 1000 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, వారి సామాజిక మాధ్యమ డేటాను విశ్లేషించినట్టు తెలిపారు. యువతలో వేతనం ఆలస్యమవుతుందన్న వేళ, వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు తాము కృషి చేస్తున్నామని, ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ తదితర ఖాతాల్లోని దరఖాస్తుదారుల వివరాలతో వారిపై ఓ అంచనాకు వస్తున్నామని ఎర్లీ శాలరీ సీఈఓ అక్షయ్ మెహరోత్రా వెల్లడించారు. అదండీ సంగతి! మీకు అప్పు కావాలంటే, ముందు సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో ఓసారి చూసుకోండి మరి.

More Telugu News