: చైనాలో జాత్యహంకార దుమారం రేపిన డిటర్జెంట్ ప్రకటన

ఓ డిటర్జెంట్ ప్రకటన చైనాలో జాత్యహంకార దుమారానికి కారణమైంది. గత నెలలో ప్రసారమైన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డిటర్జెంట్ ప్రకటన కర్తలు మాత్రం తమ లక్ష్యం నెరవేరిందని సంబరపడిపోతున్నారు. ఇంతకీ యాడ్ లో ఏముందంటే...ఓ యువతి బట్టలు ఉతుక్కునేందుకు లాండ్రీ షాపుకు వెళ్లింది. అక్కడ వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి నిల్చోగా, నల్లజాతీయుడొకరు యువతిని చూసి కన్ను కొడతాడు. దీంతో ఆ యువతి అతడిని పిలుస్తుంది. తనకు ఓకే చెబుతుందని భావించి ఆమె వద్దకు వెళ్లిన యువకుడిని చాకచక్యంగా వాషింగ్ మెషీన్ లో తోసేసి మూత వేసి, దానిపై నవ్వుతూ కూర్చుంటుంది. కాసేపటికి ఆ మూత తీయగానే నల్లగా వెళ్లిన యువకుడు తెల్లగా చైనీయుడై బయటకు వచ్చి కన్ను కొడతాడు. ఇప్పుడీ యాడ్ చైనా సోషల్ మీడియా వైబోలో వైరల్ అవుతోంది. జాత్యహంకారపూరితమైన యాడ్ ను నిషేధించాలని పలువురు పేర్కొంటున్నారు. ఆఫ్రికా జాతీయులను కించపరిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి యాడ్లు రాగా, వాటిని నిషేధించారు.

More Telugu News