: ద్రవిడ్ కు ఓటేసిన షేన్ వాట్సన్

'నాకొద్దు బాబోయ్' అని రాహుల్ ద్రవిడ్ గగ్గోలు పెడుతున్నా అతనిని మించిన కోచ్ లేరంటూ ఆటగాళ్లు అతనికే ఓటేస్తున్నారు. టీమిండియా కోచ్ పదవి ఖాళీగా ఉండడంతో త్వరలో భర్తీ చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి టీమిండియాకు ఎలాంటి కోచ్ అయితే బాగుంటుందంటూ పలువురు దిగ్గజాలు, మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు పలు సూచనలు చేస్తున్నారు. వీరంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట రాహుల్ ద్రవిడ్ కోచ్ అయితే టీమిండియాకు తిరుగుఉండదని. తాజాగా షేన్ వాట్సన్ కూడా వీరితో గొంతు కలిపాడు. టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్ అయితే ఇక తిరుగు లేదని చెబుతున్నాడు. ద్రవిడ్ కోచ్ గా ఉండగా రాజస్థాన్ రాయల్స్ కు తాను ఆడలేదని, అయితే ఆయన మెంటర్ గా ఉండగా ఆయన సారధ్యంలో ఆడానని, ఆయన అద్భుతమైన మనిషని పేర్కొన్నాడు. ఆయనలాంటి వ్యక్తి జట్టుకు కోచ్ అయితే ఏ జట్టైనా విజయపథాన పయనిస్తుందని పేర్కొన్నాడు. అందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ ను ఉదాహరణగా చూపిస్తున్నాడు. అండర్ 19 కి, భారత 'ఏ' జట్టుకి కోచ్ గా సేవలందిస్తున్న ద్రవిడ్ మాత్రం టీమిండియా కోచ్ గా మారేందుకు సిద్ధంగా లేడు. దానికి పలు కారణాలున్నాయి. దిగ్గజ ఆటగాడైన ద్రవిడ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఉన్నట్టుండి జట్టు పగ్గాలు ధోనీకి అప్పగించాల్సి వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ద్రవిడ్ సహచరులుగా ఆడిన వారిలో ధోనీ, యువరాజ్, కోహ్లీ వంటి ఆటగాళ్లు పలువురు ప్రస్తుత జట్టులో ఉన్నారు. వీరంతా ద్రవిడ్ ను ఒక్కసారిగా కోచ్ గా అంగీకరించగలరా?...సచిన్, ధోనీ కోటరీగా మెలగిన వీరంతా ద్రవిడ్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అసలే టీమిండియాలో రాజకీయాలు ఉన్నాయన్న సంగతి పలు సందర్భాల్లో బయటపడింది. అలాంటి పరిస్థితుల్లో దిగ్గజ ఆటగాడిగా నీరాజనాలు, కెప్టెన్ గా ప్రశంసలు, ద్వితీయ శ్రేణి జట్టుకు అద్భుతమైన కోచ్ అంటూ అభినందనలు అందుకున్న ద్రవిడ్ కు ఫెల్యూర్ కోచ్ అనిపించుకోవడం ఇష్టం లేదు. అందుకే టీమిండియా కోచ్ గా భాధ్యతలు చేపట్టమన్న ప్రతిసారి ఇంకా ఆ టైం రాలేదని తప్పించుకుంటున్నాడు. తన మిత్రులు గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాథ్, వెంకటపతిరాజు వంటి వారు చెబుతున్నా... జూనియర్ జట్టుతోనే తనకు బాగుందని చెబుతున్నాడు. ఇంతకీ టీమిండియా కోచ్ ఎవరో కాలమే చెబుతుంది.

More Telugu News