: ఇదో చిత్రమైన కథ... ప్రయాణాలతో మక్కువతో పారిపోయిన వ్యక్తిని 48 ఏళ్ల తరువాత కలిపిన ఫేస్ బుక్

ప్రయాణాల మీద మక్కువతో ఎప్పుడో దేశాలు దాటి వెళ్లిపోయిన వ్యక్తిని ఫేస్ బుక్ ఇప్పుడు కలిపింది. వివరాల్లోకి వెళ్తే...కేరళలో ఇయాతు, మామికుట్టి, సర్కార్ లు ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. 1951లో సర్కార్ కు 11 ఏళ్లప్పుడు పశువులు కాయడానికి అతనిని పంపించారు. అయితే, ప్రయాణాలపై ఇష్టంతో రైలెక్కేసిన సర్కార్...కొల్ కతాకు, అక్కడి నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లాడు. అక్కడి నుంచి కరాచీకి చేరుకున్నాడు. అలా 18 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగిన సర్కార్ మళ్లీ కుటుంబం చెంతకు చేరాడు. ఈసారి అలా పారిపోకూడదని భావించిన కుటుంబ సభ్యులు అతనితో కిరణా షాపు పెట్టించారు. కొద్ది నెలలపాటు షాపును బాగా చూసుకున్న సర్కార్ ఓ రోజు సరకులు తీసుకువస్తానంటూ బయల్దేరి వెళ్లిపోయాడు. ఎటెళ్లాడో తెలియదు. వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆ ఆశతోనే కాలం చేశారు. అక్క ఇయాతు, తమ్ముడు మామికుట్టికి తమ సోదరుడు సర్కార్ వస్తాడన్న ఆశలేదు, అసలు బతికున్నాడన్న ఆలోచన కూడా లేదు. ఈ క్రమంలో అబుదాబీలో ఉంటున్న మామికుట్టి మవనడు నాదీర్ షాకి పాకిస్థాన్ లోని కరాచీలో ఉంటున్న సర్కార్ కుమార్తె ఆసియాతో ఫేస్ బుక్ లో పరిచయమైంది. దీంతో వారి మూలాల గురించి తెలుసుకున్నారు. అంతే, ఇక ఆలస్యం చేయకుండా కరాచీ నుంచి సర్కార్, కేరళ నుంచి ఇయాతు, మామికుట్టి బయల్దేరి అబుదాబీ చేరుకున్నారు. అక్కడ మనవడి ఇంట్లో అంతా కలుసుకున్నారు. దీంతో అంతా భావోద్వేగానికి గురయ్యారు. తన వారికి దూరమై ఇంతకాలం ఎంతో వేదన చెందానని, ఇకపై వారికి దూరంకానని సర్కార్ చెబుతున్నాడు. 48 ఏళ్ల తరువాత సర్కార్ ని కలవడంతో ఇయాతు, మామికుట్టి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తామిలా మళ్లీ కలుస్తామని భావించలేదని, అల్లా దయవల్ల ఇలా కలుసుకోగలిగామని వారు పేర్కొన్నారు.

More Telugu News