: పాక్ జట్టుకు ఆడడమే నా డిగ్రీ: షహర్యార్ వ్యాఖ్యలకు జవాబిచ్చిన హఫీజ్ సయీద్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు చేసిన కామెంట్లు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ ఆటగాళ్లను నిశానీలను చేసిందని ఆ దేశీయులు వాపోతున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు రేగాయి. పాక్ లో తీవ్రవాదం కారణంగా ఆ జట్టుతో ఆడేందుకు ఏ జట్లూ ముందుకు రావడం లేదు. భారత్ లో పాక్ తీవ్రవాదుల దుశ్చర్యల కారణంగా పాక్ లో ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. దీంతో ఒకప్పుడు భారత్ తో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న పీసీబీ కష్టాల్లో పడింది. ఆటగాళ్లకు జీతాలిచ్చుకోలేని స్ధితికి దిగజారింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో టోర్నీలు నిర్వహిస్తూ, సగం ఆదాయం ఆయా దేశాలకు ఇచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ లలో ఓటమిపాలైంది. దీంతో భారత్ తో సమానంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేకపోవడంపై అసహనంతో పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌ ఓటమికి కారణం జట్టులో ఎక్కువ చదువుకున్న క్రికెటర్లు లేకపోవడమేనని అన్నారు. దీనిపై ఆ దేశ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ ట్విట్టర్‌ లో జవాబిచ్చాడు. ‘నేను పాక్‌ తరఫున టెస్టు క్రికెట్‌ ఆడుతున్నందుకు గర్వపడుతున్నా.. ఇదే నా డిగ్రీ. జీవితంలో చదువు అనేది ముఖ్యమే కానీ.. డిగ్రీలు సంపాదించడమే జీవితం కాదు. క్రికెటే మనిషి జీవితంలో సంపూర్ణమైన చదువనేది నా నమ్మకం’ అంటూ ఘాటైన ట్వీట్ తో పీసీబీ చీఫ్ కు సమాధానం చెప్పాడు.

More Telugu News