: ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

సెషన్ ఆరంభం నుంచి పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన భారత స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం తరువాత లాభాల్లోకి పయనించింది. అటుపిమ్మట కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు ఆసక్తిని ప్రదర్శించ లేదని, ఇదే సమయంలో క్రూడాయిల్ ధరల పతనం సెంటిమెంట్ ను హరించిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. చిన్న, మధ్య తరహా కంపెనీలు భారీగా నష్టపోయాయి. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 75.11 పాయింట్లు పెరిగి 0.30 శాతం లాభంతో 25,305.47 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 17.80 పాయింట్లు పెరిగి 0.23 శాతం లాభంతో 7,748.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.16 శాతం, స్మాల్ కాప్ 0.65 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 30 కంపెనీలు లాభపడ్డాయి. గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఏసీసీ, టాటా మోటార్స్, టాటా పవర్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అరవిందో ఫార్మా, ఐడియా సెల్యులార్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,691 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 902 కంపెనీలు లాభాలను, 1,606 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 95,59,497 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 95,41,920 కోట్లకు తగ్గింది.

More Telugu News