: ఇండియాలో ఆదాయమంటే సినిమాలు, క్రికెటే... యాపిల్ చీఫ్ సీరియస్ ప్లాన్లు!

ఇండియాలో భారీగా ఆదాయం పొందాలంటే, టెక్నాలజీకన్నా సినీరంగం, క్రికెట్ అయితే అత్యుత్తమమన్న భావనకు యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన భారత పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన, భారతీయులకు సినిమాలన్నా, క్రికెట్ ఆటన్నా అమిత ఇష్టమని, ఈ రంగంలోకి ప్రవేశిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సినీ నిర్మాత ముఖేష్ భట్ వెల్లడించారు. "ఆయన తన సంస్థ విస్తరణ కోసం ఎన్నో ప్రణాళికలతో ఇండియాకు వచ్చారు. బాలీవుడ్, క్రికెట్ ఆయన మనసులో భవిష్యత్ వ్యాపార రంగాలుగా కచ్చితంగా ఉన్నాయి" అని ముఖేష్ భట్ వ్యాఖ్యానించారు. ఆయన తాము నిర్మిస్తున్న 'రాజ్ రీబూట్' సెట్ కు వచ్చి తాము వాడుతున్న యాపిల్ ఉత్పత్తులను నిశితంగా గమనించారని తెలిపారు. ఇక ఆయన ముందుగా ప్రణాళిక వేసుకునే కాన్పూర్ లో జరిగిన ఐపీఎల్ పోటీ తిలకించేందుకు వచ్చారని సమాచారం. తొలుత ముంబై లేదా పుణెలో ఓ మ్యాచ్ తిలకించాలని భావించారని, అక్కడి పోటీలు తరలి వెళ్లడంతో కాన్పూరుకు వెళ్లారని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఓ ఫ్రాంచైజీ కొనుగోలు, భారత క్రికెట్ టీంకు యాపిల్ బ్రాండింగ్ వంటి అంశాలను ఆయన పరిశీలిస్తున్నట్టు యాపిల్ వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ టీంకు టెక్నాలజీ భాగస్వామిగా ఉండే విషయమై ఆయన రాజీవ్ శుక్లాతో చర్చించినట్టూ తెలుస్తోంది. కాగా, గతంలో భారత పర్యటనలకు వచ్చిన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ తదితరులు కేవలం వ్యాపారానికి, పారిశ్రామికవేత్తలతో చర్చలకు మాత్రమే పరిమితం కాగా, యాపిల్ చీఫ్ మరో రెండడుగులు ముందుకేసి భారతీయులు ప్రాణమిచ్చే సినిమాలు, క్రికెట్ లను మరో కోణంలో చూడటం గమనార్హం.

More Telugu News