: ‘మిస్టర్ ఎం’ అంటూ మహేష్ బాబుపై దర్శకుడు వర్మ వ్యంగ్య ట్వీట్లు

తనదైన శైలి ట్వీట్లతో ఎప్పుడూ సంచలనాలు చేయడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. తాజాగా, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’పై విమర్శల ట్వీట్లు కురిపించాడు వర్మ. ‘కుటుంబ కథా చిత్రాల నిర్మాణాన్ని ఎప్పుడైతే ఆపేస్తారో అదే నాకు ప్రధాన ఉత్సవంతో లాంటిది. నాకు ఇప్పుడే బ్రహ్మదేవుడు ముఖం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది. బ్రహ్మోత్సవంలోని మహేష్ డ్యాన్స్ చూసి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కొరియో గ్రాఫర్లు సేవియన్ గ్లోవర్, మార్తా గ్రాహమ్, జార్జ్ బెలాన్ షైన్ తదితరులు నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు ఒక ఫ్యామిలీ వెళితే ఎలా ఉంటుందంటే... ఆ చిత్రంలో హీరోయిన్ల అందాలను తండ్రి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ల దుస్తులను తల్లి గమనిస్తుంటుంది. కూతురేమో తన బాయ్ ఫ్రెండ్ కు మెస్సేజ్ పంపుతుంటుంది. విసుగుపుట్టిన కొడుకేమో నిద్ర పోతుంటాడు. కుటుంబ కథా చిత్రాలను చూడడానికని థియేటర్లకు వచ్చే వారు అలా కూర్చుని ఇలా లేచిపోతారన్న విషయాన్ని 'మిస్టర్ ఎం' అర్థం చేసుకోవాలి. కానీ, పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ వంటి చిత్రాలను చూసేందుకు థియేటర్లకు వచ్చేవారు సీట్లకు అతుక్కుపోతారు. ఎంతో గొప్ప కుటుంబ కథా చిత్రాలుగా పేరు పొందినవన్నీ శోభన్ బాబువే కానీ, ఎన్టీఆర్, కృష్ణా నటించిన చిత్రాలు కాదు. ‘దేవత’ సినిమా చాలా గొప్ప కథ అని నాకు గుర్తుంది. కానీ, శోభన్ బాబు గుర్తులేడు. ఏజెంట్ గోపీ, అడవిరాముడు చిత్రాల్లో కృష్ణ, ఎన్టీఆర్ గుర్తున్నారు కానీ, ఆ సినిమా కథలు గుర్తు లేవు. సాధారణ కుటుంబాల్లో మీ స్టార్ డమ్ ఇంకా ఇంకా పెరగాలి మిస్టర్ ఎం. నా వ్యాఖ్యలను ఎం ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని వర్మ ఆ ట్వీట్లలో పేర్కొన్నాడు. ఇక్కడ 'మిస్టర్ ఎం' అంటే మహేశ్ బాబును ఉద్దేశించి అని మనం అర్థం చేసుకోవాలి.

More Telugu News