: బంగారం బాండ్లపై అంచనాకు మించిన ప్రీమియం వస్తుందంటున్న నిపుణులు!

ఆరు నెలల క్రితం మోదీ సర్కారు విక్రయించిన బంగారం బాండ్లను కొనుగోలు చేసిన వారికి అంచనాలను మించిన ప్రీమియంతో లాభం దగ్గర కానుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ బాండ్లు ఈ నెలాఖరు నుంచి మార్కెట్లో లిస్టింగ్ కానుండగా, జూన్ మొదటి వారం నుంచి ట్రేడింగ్ చేసుకొవచ్చు. ఇప్పటికే ఇన్వెస్టర్లు 5 టన్నులకు పైగా బంగారంపై బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టగా, వీటి లిస్టింగ్ తొలి రోజునే మంచి ప్రీమియం లభించవచ్చని అంచనా. గత సంవత్సరం నవంబరులో గ్రాముకు రూ. 2,682పై 999 స్వచ్ఛత గల బంగారం బాండ్లను కేంద్రం విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ బాండ్లు 20 శాతం ప్రీమియంను అందిస్తూ, గ్రాముకు రూ. 3,200 వద్ద ట్రేడవుతాయని ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. అంటే ఆరు నెలల వ్యవధిలో బంగారం బాండ్లు 20 శాతం రాబడిని అందించనున్నాయన్న మాట. బ్రోకరేజి, పన్నులు వంటివి 1 నుంచి 2 శాతం వరకూ పోయినా, బులియన్ బాండ్లలో పెట్టిన పెట్టుబడి మంచి లాభాలనే అందిస్తుందని బులియన్ ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ బాండ్లపై ప్రకటించిన 2.75 శాతం వడ్డీ రేటుతో పోలిస్తే, లిస్టింగ్ రోజున విక్రయించి పెట్టుబడి వెనక్కు తీసుకోవాలని భావించే వారికి ఇది శుభవార్తే.

More Telugu News