: మంచి రికవరీ నమోదు చేసిన స్టాక్ మార్కెట్

సెషన్ ఆరంభమైన నిమిషాల వ్యవధిలో గతవారం ముగింపుతో పోలిస్తే భారీగా జారిపోయిన బెంచ్ మార్క్ సూచికలు, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత వెల్లువెత్తిన కొనుగోలు మద్దతుతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. క్రితం ముగింపుతో పోలిస్తే ఒకదశలో 160 పాయింట్లకు పైగా పడిపోయి 25,360 పాయింట్ల వరకూ దిగజారిన సెన్సెక్స్ ఆపై కొనుగోళ్లతో ముందడుగు వేసింది. సెషన్ కనిష్ఠస్థాయితో పోలిస్తే, మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి 320 పాయింట్లకు పైగా రికవరీ నమోదు చేసి 25,680 పాయింట్లకు చేరింది. ఆపై స్వల్పంగా అమ్మకాలు కనిపించినా, మొత్తం మీద లాభాలను కొనసాగించింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 163.66 పాయింట్లు పెరిగి 0.64 శాతం లాభంతో 25,653.23 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 45.85 పాయింట్లు పెరిగి 0.59 శాతం లాభంతో 7,860.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.30 శాతం, స్మాల్ కాప్ 0.09 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, ఇన్ ఫ్రా టెల్, బోష్ లిమిటెడ్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐఎన్, సిప్లా, అదానీ పోర్ట్స్, ఐడియా సెల్యులార్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,739 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,302 కంపెనీలు లాభాలను, 1,263 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 97,22,598 కోట్లుగా నమోదైంది.

More Telugu News