: సుశీల్ కుమార్ కు ఎదురు దెబ్బ...ఒలింపిక్స్ లో నర్సింగ్ యాదవే

రియో ఒలింపిక్స్ బెర్తు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. రియో ఒలింపిక్స్ కు నర్సింగ్ యాదవ్ ను ఎంపిక చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్యూఎఫ్ఐ) ప్రకటించింది. సోన్ పేట్ లో ప్రారంభం కానున్న భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో సుశీల్ పాల్గొనవచ్చని రెజ్లింగ్ సమాఖ్య సూచించింది. రెజ్లింగ్‌ లో 74 కేజీల విభాగం భారత్ తరఫున ఉన్న ఆటగాళ్లలో సుశీల్ కుమార్ (ఢిల్లీ), నర్సింగ్ యాదవ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు. అయితే, గత ఏడాది లాస్‌ వేగాస్‌ లో జరిగిన ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గాడు. దీంతో పాటు టాప్-6 లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ ను ఖాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీల్లో పాల్గొనాల్సిన సుశీల్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అవకాశం అందుకోవడమే కాకుండా, పతకం అందించి, ఈ టోర్నీలో భారత్ ఆడేందుకు కారణమైన నర్సింగ్ యాదవ్ ను ఎలా తొలగిస్తారని రెజ్లింగ్ సమాఖ్య ప్రశ్నించింది. నర్సింగ్ యాదవ్ లేకుంటే భారత్ ఆడే అవకాశమే లేదని, అలాంటప్పుడు అతనిని కాదని, పేరుందన్న కారణంతో సుశీల్ కుమార్ ను ఆడించడం ఎంతవరకు కరెక్టు అని రెజ్లింగ్ సమాఖ్య ప్రశ్నించింది. సుశీల్ కుమార్ కు మరో ఆటగాడు యోగేశ్వర్ దత్, సచిన్ వంటి వారు మద్దతు పలకడం కూడా వారి ఆగ్రహానికి కారణమైంది. అంతటితో ఆగని సుశీల్ కుమార్ ఏకంగా రెజ్లింగ్ సమాఖ్య వైఖరిని ప్రశ్నించాడు. పలువురిని కలుగజేసుకోవాలని డిమాండ్ చేశాడు. అయినప్పటికీ ఓ ప్రతిభావంతుడైన క్రీడాకారుడికి రెజ్లింగ్ సమాఖ్య మద్దతుగా నిలవడం విశేషం.

More Telugu News