: సంపద సృష్టికి బంగారమే బెస్ట్.. ఎందుకంటే..: రాకేష్ ఝున్ ఝున్ వాలా

భవిష్యత్తులో సంపద సృష్టిని కోరుతూ, పెట్టుబడులు పెట్టాలని భావిస్తే, అందుకు బంగారం బెస్ట్ ఆప్షన్ అని ఇండియాలో ఈక్విటీ బుల్, లెజండరీ ఇన్వెస్టర్ గా పేరు తెచ్చుకున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా సలహా ఇస్తున్నారు. "మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే, కొంత భాగాన్ని కచ్చితంగా బంగారంవైపు మళ్లించండి. ఎందుకంటే, హెచ్చతగ్గులకు లోనయ్యే వడ్డీ రేట్లకు బంగారం అతీతం. భవిష్యత్తులో బంగారం ధర గణనీయంగా పెరుగుతుంది. ఎవరి దగ్గరైనా డబ్బుండి, దాన్ని బ్యాంకులో దాచాలని ఆశిస్తే, అది నష్టాన్ని దగ్గర చేసే ఆలోచనే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అనిశ్చితి నెలకొంది. మీ డబ్బంతా బంగారంలో పెట్టమని చెప్పడం లేదు. ఎంతో కొంత పెడితే, నష్టపోరని మాత్రం చెప్పగలను" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. కాగా, 2016 సంవత్సరంలో ఇప్పటివరకూ బంగారమే పెట్టుబడికి అత్యుత్తమంగా నిలిచింది. మూడు నెలల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3 వేలకు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో రాబడి మరే ఇతర పోర్ట్ పోలియో అందించలేదు. గడచిన 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా, ఓ త్రైమాసికంలో బంగారం అత్యధిక రాబడిని (20.21 శాతం) అందించింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు 1.7 శాతం నష్టాన్ని మిగిల్చాయి.

More Telugu News