: పడిలేచిన కెరటంలా స్టాక్ మార్కెట్!

సెషన్ ఆరంభమైన గంట వ్యవధిలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 250 పాయింట్లు లాభంలోకి వెళ్లిన సెన్సెక్స్, ఆపై అమ్మకాల ఒత్తిడితో 160 పాయింట్లు కోల్పోయినా, చివర్లో వచ్చిన కొనుగోలు మద్దతు మార్కెట్ సూచికలను లాభాల్లోకి నడిపించింది. యూరప్ మార్కెట్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నిలిపాయని, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీల కొనుగోలుకు యత్నించినట్టు నిపుణులు వ్యాఖ్యానించారు. దీంతో గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 193.20 పాయింట్లు పెరిగి 0.75 శాతం లాభంతో 25,790.22 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 51.55 పాయింట్లు పెరిగి 0.66 శాతం లాభంతో 7,900.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.69 శాతం, స్మాల్ కాప్ 0.93 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 35 కంపెనీలు లాభపడ్డాయి. బోష్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హిందాల్కో, ఆసియన్ పెయింట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అరవిందో ఫార్మా, ఐచర్ మోటార్స్, ఎంఅండ్ఎం, హిందుస్థాన్ యూనీలివర్, యాక్సెస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,753 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,569 కంపెనీలు లాభాలను, 1,001 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 96,79,347 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 97,57,468 కోట్లకు పెరిగింది.

More Telugu News