: ఆడం జంపా సూపర్ ఫీట్...సన్ రైజర్స్ 137

ఐపీఎల్ చరిత్రలో అరుదుగా నమోదయ్యే ఫీట్ ను ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ ఆడం జంపా సాధించి రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఏకంగా ఆరు వికెట్లను తీసి సత్తా చాటాడు. విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరంభంలోనే కెప్టెన్ వార్నర్ (11) ను ఆర్పీ సింగ్ అవుట్ చేయడంతో, బ్యాటింగ్ నత్తనడకన సాగింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (33) ఇన్నింగ్స్ గేర్ మార్చే టైంలో అవుట్ కావడంతో సన్ రైజర్స్ భారీ స్కోరుకు బ్రేక్ పడింది. అనంతరం విలియమ్సన్ (32) నిలదొక్కుకున్నా, స్కోరు బోర్డుకు వేగం పెంచడంలో వెనుకబడ్డాడు. యువరాజ్ సింగ్ (23) రెండు సిక్సర్లతో ఆశలు రేపినప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. హెన్రిక్స్ (10) భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. హుడా (14)ను ధోనీ స్టంపౌట్ చేసి పెవిలియన్ కు పంపాడు. ఓజా (7)ను బౌల్డ్ చేసిన జంపా, భువనేశ్వర్ కుమార్ (1)ను చివరి బంతికి అవుట్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాదు ఇన్నింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగుల వద్ద ముగిసింది. హైదరాబాదు ఇన్నింగ్స్ పతనంలో ఆడమ్ జంపా కీలక పాత్ర పోషించాడు. 2008లో పాకిస్థాన్ బౌలర్ సొహైల్ తన్వీర్ నెలకొల్పిన 6 వికెట్ల ఫీట్ ను సాధించి, అతని సరసన చేరాడు. కేవలం 19 పరుగులు ఇచ్చిన జంపా 6 వికెట్లు నేలకూల్చి ఆకట్టుకున్నాడు. అతనికి ఆర్పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.

More Telugu News