: మూడు శాతం నష్టాన్ని మరిచి ఎగిరి దుముకిన మార్కెట్ బుల్!

గత రెండు వారాల్లోనూ అనిశ్చితి మధ్య 3 శాతానికి పైగా నష్టపోయిన బెంచ్ మార్క్ సూచికలు, సోమవారం నాడు ఒక్కసారిగా లాభాల్లో పరుగులు పెట్టాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల వరకూ కొత్తగా ఈక్విటీల కొనుగోలుకు ప్రయత్నించడంతో మార్కెట్ బుల్ హై జంప్ చేసింది. కీలక మద్దతు స్థాయుల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించలేదని నిపుణులు వ్యాఖ్యానించారు. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మరెక్కడా వెనుదిరగలేదు. దీంతో, సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 460.36 పాయింట్లు పెరిగి 1.82 శాతం లాభంతో 25,688.86 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 132.60 పాయింట్లు పెరిగి 1.71 శాతం లాభంతో 7,866.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.25 శాతం, స్మాల్ కాప్ 1.20 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 44 కంపెనీలు లాభపడ్డాయి. బోష్ లిమిటెడ్, జడ్ఈఈఎల్, బజాజ్ ఆటో, యస్.బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్, ఐడియా, సిప్లా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,807 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,673 కంపెనీలు లాభాలను, 970 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,09,079 కోట్ల రూపాయలకు చేరింది.

More Telugu News