: బ్యాటింగ్ లో ఆకట్టుకున్న ఢీల్లీ...ఫీల్డింగ్ తో కనికట్టు చేసిన పూణే

ఐపీఎల్ లో భాగంగా మోహలీ వేదికగా 33వ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లు ఆకట్టుకున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టుకు అశోక్ ధిండా ఓపెనర్ రిషబ్ పంత్ (2) ను బౌల్డ్ చేసి ఆదిలోనే షాకిచ్చాడు. అనంతరం సంజు శాంసన్ (20) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో రంగప్రవేశం చేసిన డుమిని (34) అనుభవంతో ఆకట్టుకున్నాడు. వికెట్ కాపాడుకుంటూ ఆటగాళ్లలో స్థైర్యం పెంచాడు. మరోవైపు ఆటగాళ్లు ధాటిగా ఆడి, ఆ కంగారులో పెవిలియన్ చేరసాగారు. ఈ క్రమంలో కరణ్ నాయర్ (32), బిల్లింగ్స్ (24), బ్రాత్ వైట్ (24), పవన్ నేగి (19) ఆకట్టుకున్నారు. కీలక సమయంలో డుమిని, యాదవ్ రనౌట్ కావడంతో భారీ స్కోరు దిశగా సాగిన ఢిల్లీ ఇన్నింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది. పూణే ఫీల్డింగ్ విన్యాసాలు అభిమానులను అలరించాయి. బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకోగా, ధోనీ మెరుపు స్టంపింగ్స్ తో ఢిల్లీ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచాడు. పూణే ఫీల్డర్లు విసిరిన మెరుపు త్రోలు ఇద్దరు ఆటగాళ్లను అవుట్ చేయగా, పలు సందర్భాల్లో నేరుగా వికెట్లను గిరాటేశాయి. పూణే బౌలర్లలో బోలాండ్, భాటియా చెరి రెండు వికెట్లు తీయగా, ధిండా ఒక వికెట్ తో ఆకట్టుకున్నాడు. కాగా, 163 పరుగుల విజయ లక్ష్యంతో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

More Telugu News