: కబుర్లు కట్టిపెట్టి... డబ్బులు చూపండి!: మాల్యాపై ఎస్బీఐ చైర్ పర్సన్ ఆగ్రహం

వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ నగరం ఫ్రాంక్ ఫర్ట్ కు వచ్చిన భట్టాచార్య నిన్న అక్కడి మీడియాతో మాట్లాడిన సందర్భంగా మాల్యా తీరుపై ఆమె ఫైరయ్యారు. మాల్యాకు రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్టియానికి ఎస్బీఐ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మాల్యా... ఆ తర్వాత అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రూ.6 వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భట్టాచార్య... డబ్బులు కడతానని కబుర్లు చెప్పడం మినహా, ఆ డబ్బును మాల్యా చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబుర్లు చెప్పడం మాని, తమకు చెల్లిస్తానని చెబుతున్న డబ్బును మాల్యా చూపితే దానిని తాము పరిశీలిస్తామని భట్టాచార్య వ్యాఖ్యానించారు.

More Telugu News