: లండన్ వీడేది లేదు!... తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశం వదిలా!: విజయ్ మాల్యా కొత్త కథ

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పిట్ట కథలు చెబుతున్నారు. 17 బ్యాంకుల వద్ద కోట్లాది రూపాయలు రుణంగా తీసుకుని వాటిని ఎగవేసి తప్పించుకుని లండన్ పారిపోయారు. ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు కొరడా ఝుళిపించడంతో కాస్తంత దారికొచ్చినట్లే కనిపించిన మాల్యా... మరోమారు తన మొండి వైఖరిని చాటుకున్నారు. బ్రిటన్ కు చెందిన ప్రముఖ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొత్త కథ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను దేశం వదిలిపెట్టాల్సి వచ్చిందని మాల్యా పేర్కొన్నారు. ఇక ఇప్పటికిప్పుడు లండన్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా మాల్యా పేర్కొన్నట్లు ఆ పత్రిక రాసింది. బ్యాంకులకు బకాయిపడ్డ మొత్తం రూ.9 వేల కోట్లకు బదులుగా... రూ.6 వేల కోట్లను చెల్లిస్తానని ఆయన సుప్రీంకోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగానే ఉన్నానని కూడా మాల్యా ఆ పత్రికకు చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికీ తాను బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని కూడా ఆయన చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.

More Telugu News