: బ్రిటన్ ఓటరు లిస్టులో మాల్యా పేరు!... లిక్కర్ కింగ్ ను రప్పించడం ఇక కష్టమేనా?

బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా తిరిగి భారత్ కు వచ్చేలా లేరు. ఇప్పుడప్పుడే దేశానికి రాలేనని ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సహా, సుప్రీంకోర్టుకు బహిరంగంగానే తెలిపిన మాల్యా... అసలు దేశానికి వచ్చే ఉద్దేశంతోనే లేరని తెలుస్తోంది. ఈ మేరకు నిన్న ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. భారత పార్లమెంటులోని పెద్దల సభ రాజ్యసభలో ఇప్పటికీ సభ్యుడిగా కొనసాగుతున్న మాల్యా పేరు బ్రిటన్ ఓటరు జాబితాలో ఉందట. గుట్టు చప్పుడు కాకుండా విదేశానికి చెక్కేసిన మాల్యాను దేశానికి రప్పించే క్రమంలో ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ ఆయన పాస్ పోర్టును 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వారంలోగా తమ నోటీసులకు స్పందించకుంటే పాస్ పోర్టును రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. భారత విదేశాంగ శాఖ హెచ్చరికలను మాల్యా అసలు పట్టించుకున్న పాపానే పోలేదు. ఈ క్రమంలో నిన్న మాల్యా పాస్ పోర్టును రద్దు చేస్తూ విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన వెలువడిన మరుక్షణమే మాల్యాకు బ్రిటన్ లో ఓటు హక్కు ఉన్న విషయం బయటకు పొక్కింది. 1992 నుంచే మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం ఉందన్న విషయమూ వెలుగుచూసింది. బ్రిటన్ పౌరుడిగా ఉన్న తనకు భారత్ పాస్ పోర్టు రద్దు వల్ల వచ్చే నష్టమేమీ లేదన్న కోణంలోనే మాల్యా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే విదేశాంగ శాఖ హెచ్చరికలను మాల్యా ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక బ్రిటన్ పౌరసత్వమున్న మాల్యాను ఇకపై దేశానికి రప్పించడం భారత అధికారులకు సాధ్యం కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News