: గూగుల్, ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాలకు ముంపు ముప్పు!

ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్, ఫేస్ బుక్ లకు ఇప్పుడు ఓ పెద్ద ప్రమాదం వచ్చి పడింది.! అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో సాగర తీరాన్ని ఆనుకుని గూగుల్, ఫేస్ బుక్, సిస్కో ప్రధాన కార్యాలయాలు ఉన్న విషయం తెలిసిందే. పెరుగుతున్న సముద్ర మట్టంతో ఇవి భవిష్యత్తులో మునిగిపోయే ప్రమాదం ఉందని ఓ శాస్త్రవేత్తల బృందం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు, కాలుష్యమే కారణమని అంటోంది. ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను కట్టడి చేసినా సరే ఈ కంపెనీల కార్యాలయాలు ఇతర ప్రపంచంతో సంబంధాలు తెంచుకునే ముప్పు మాత్రం తగ్గదని ఆ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ కార్యాలయానికి ఎక్కువగా ముప్పు ఉందని ఈ టీమ్ అంటోంది. చాలా లోతట్టు ప్రాంతంలో ఫేస్ బుక్ కార్యాలయాన్ని నిర్మించారని, ఎంత ఖర్చయినా సరే తమను రక్షించుకోగలమని ఆ కంపెనీ భావిస్తోందని క్యాలిఫోర్నియా బే కన్జర్వేషన్ అండ్ డెవలప్ మెంట్ కమిషన్ కు చెందిన సీనియర్ ప్లానర్ లిండీ లోవే అన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి సాగర జలాల ఎత్తు ఒకటిన్నర అడుగు మేర పెరగనున్న నేపథ్యంలో ఫేస్ బుక్ కార్యాలయం ప్రస్తుతమున్న ఎత్తులో భద్రంగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సాగర జలాలు కొంచెం ఎత్తు పెరిగినా 101 హైవే పైకి చొచ్చుకు వస్తాయని దాంతో గూగుల్ ప్లెక్స్ (గూగుల్ కార్యాలయం) జల ముప్పులో చిక్కుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ఎన్విరాన్ మెంట్ ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్ విభాగానికి చెందిన క్రిస్టినా హిల్ చెబుతున్నారు. పెరిగే సాగర జలాల మట్టంతో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో సాగర తీరంలో ఉన్న 100 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య, నివాస ప్రాంతాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తల అంచనా.

More Telugu News