: కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్న స్నాప్ డీల్: తీవ్ర ఆరోపణ చేసిన పేటీఎం

ఇండియాలోని పెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన స్నాప్ డీల్, తన కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోందని చెల్లింపు సేవల సంస్థ పేటీఎం సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. స్నాప్ డీల్ అనుబంధ సంస్థగా ఉండి, చెల్లింపు మాధ్యమ సేవలను అందిస్తున్న యూనీ కామర్స్ తమ ద్వారా చెల్లింపులను జరిపే వాళ్ల ఖాతాలకు సంబంధించి రహస్యంగా ఉండాల్సిన వివరాలను తస్కరిస్తోందని ఆరోపించింది. పేటీఎం ప్లాట్ ఫాంపై లావాదేవీలు జరుపుతున్న ఎందరో కస్టమర్లు, తమ ఆర్డర్లను నిర్వహించుకునేందుకు యూనీ కామర్స్ ను వాడుకుంటున్నారని, వారి వివరాలన్నీ యూనీ కామర్స్ కు, ఆపై దాని మాతృ సంస్థ స్నాప్ డీల్ కు అందుతున్నాయని హైకోర్టుకు వెల్లడించింది. ఇదే సమయంలో తమ లోగోను, పేరును కూడా వాడుతూ కస్టమర్లను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించింది. హైకోర్టులో పిటిషన్ విషయమై స్పందించేందుకు పేటీఎం, తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు స్నాప్ డీల్, యూనీ కామర్స్ సంస్థలు నిరాకరించాయి.

More Telugu News