: శిక్ష వేసిన చేతులతోనే ఆలింగనం!... స్నేహితుడి బుద్ధిని మార్చేసిన మహిళా జడ్జి

వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. చిన్ననాడు స్కూలులో కలిసి ఆటలాడుకున్న వారు తదనంతర కాలంలో విభిన్న మార్గాల్లో పయనించారు. ఆ స్నేహితుల్లోని బాలిక బుద్దిగా చదువుకుని జడ్జీ పోస్టులో ఆసీనులవ్వగా, అబ్బాయి మాత్రం చెడు సావాసాలతో దోపిడీ దొంగగా మారాడు. చిన్నప్పుడు పాఠశాల స్థాయి విద్య పూర్తి చేసుకున్న తర్వాత వారిద్దరూ ఎక్కడా కలవలేదు. ఏళ్ల తర్వాత వారిద్దరూ కలిశారు. ఎక్కడనుకుంటున్నారు?... కోర్టులో. న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న మహళా జడ్జీ మిండీ గ్లేజర్... దోపిడీ దొంగగా బోనులో నిలిచిన వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆథర్ బూత్ గా గుర్తించి పలకరించింది. అయితే తన చిన్ననాటి స్నేహితురాలి ప్రస్తుత స్థానాన్ని, తానున్న పరిస్థితిని తలచుకుని ఆథర్ కుమిలిపోయాడు. ఈ ఘటనకు సంబందించిన వార్త 10 నెలల క్రితం విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. అమెరికాలోని మియామీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో దోషిగా తేలిన తన చిన్ననాటి స్నేహితుడు ఆథర్ కు... మిండీ గ్లేజర్ పది నెలల జైలు శిక్ష విధించారు. చిన్ననాటి స్నేహితురాలి ఉన్నత స్థితిని తలచుకున్న ఆథర్... పశ్చాత్తాప భావనతో మనసు మార్చుకుని జైలుకెళ్లాడు. తాజాగా మొన్న (మంగళవారం) ఆథర్ తన శిక్షను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని గ్లేజర్ నేరుగా అతడు ఉంటున్న జైలు వద్దకు వెళ్లారు. తన స్నేహితుడి కోసం వేచి చూశారు. ఆథర్ బయటకు రాగానే శిక్ష వేసిన చేతులతోనే అతడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇకపై ఆథర్ పరోపకారమే లక్ష్యంగా పనిచేస్తాడని గ్లేజర్ చెప్పగా... గ్లేజర్ ను ఆదర్శంగా తీసుకుని జీవితం కొనసాగిస్తానని ఆథర్ చెప్పాడు.

More Telugu News