: రాణించిన విజయ్, వోహ్రా...మ్యాక్స్ వెల్ దూకుడు...పంజాబ్ తొలి విజయం

ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా మొహాలీ వేదికగా రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించింది. ఈ టోర్నీలో పేలవమైన ఆటతీరుతో విమర్శలపాలైన పంజాబ్ జట్టు స్పూర్తిమంతమైన విజయం సాధించింది. టాస్ గెలిచిన పూణే జట్టు బ్యాటింగ్ కు దిగి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆదిలోనే ఓపెనర్ రహానే (9) వికెట్ కోల్పోయింది. అనంతరం కుదురుకున్నట్టు కనిపించిన పీటర్సన్ (15) కూడా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ (67) ఆకట్టుకున్నాడు. పెరీరా (8) విఫలం కాగా, స్మిత్ (38) కుదురుకున్నాడు. ధోనీ (1) నిరాశపర్చగా, ఇర్ఫాన్ పఠాన్ (2) రన్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో భారీ స్కోరు దిశగా సాగుతుందని భావించిన ధోనీ సేన కేవలం 152 పరుగులకే పరిమితమైంది. అనంతరం 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు మురళీ విజయ్ (53), వోహ్రా (51) అర్ధసెంచరీలతో రాణించి శుభారంభం ఇచ్చారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుటయ్యారు. అనంతరం మురుగన్ అశ్విన్ ధాటికి మార్స్ (4), మిల్లర్ (7) కూడా త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో మళ్లీ పంజాబ్ ఓటమిదిశగా సాగుతుందని అంతా అనుకున్నారు. అప్పుడు సాహా (4) సాయంతో మ్యాక్స్ వెల్ విరుచుకుపడ్డాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. దీంతో కేవలం 18.4 ఓవర్లో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పంజాబ్ 8 వికెట్ల తేడాతో పూణేపై విజయం సాధించింది.

More Telugu News