: చేసి చూపించిన విశాల్ శిక్కా... నాలుగోసారి అంచనాలను మించి ఇన్ఫోసిస్ లాభాలు

వరుసగా నాలుగోసారి కూడా ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ శిక్కా తనదైన మ్యాజిక్ ను చేసి చూపించారు. ఏడాదిన్నర క్రితం వరకూ లాభాలను నమోదు చేయడంలో అష్టకష్టాలూ పడుతున్న ఇండియాలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ బాధ్యతలు స్వీకరించిన విశాల్, అప్పటి నుంచి సంస్థను విజయపథంలో నడిపిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31తో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 3,597 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ మూడు నెలల కాలంలో అమ్మకాల ఆదాయం రూ. 16,550 కోట్లని సంస్థ వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలకు మించిన ఆదాయం, లాభాలను ఇన్ఫీ అందుకోవడం ఇది నాలుగోసారి. ఇక 2016-17లో వృద్ధి రేటు మరింత దూసుకెళుతుందని, సంస్థ పనితీరు మెరుగుపడి, తిరిగి పట్టాలపైకి ఎక్కిందని అనలిస్టులు వ్యాఖ్యానించారు. "ఈ త్రైమాసికంలో మేము సాధించిన ఫలితాలను చూసి గర్వపడుతున్నాం. ఐటీ పరిశ్రమలోనూ సంకేతాలు బాగున్నాయి. భవిష్యత్తులో మా ప్రయాణం మరింత సుఖవంతమవుతుందని భావిస్తున్నాం" అని ఫలితాల విడుదల సందర్భంగా శిక్కా వ్యాఖ్యానించారు. ఐటీ ఇండస్ట్రీలో 10 నుంచి 12 శాతం ఆదాయవృద్ధిని అంచనా వేస్తుండగా, ఇన్ఫోసిస్ లో 11.5 నుంచి 13.5 శాతం వరకూ ఆదాయ వృద్ధి ఉంటుందని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ వెల్లడించిన పాజిటివ్ ఫలితాలు సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు శ్రీరామనవమి కారణంగా మార్కెట్లకు సెలవన్న సంగతి తెలిసిందే. ఆపై శని, ఆదివారాల తరువాత, సోమవారం నాడు ఇన్ఫోసిస్ మంచి లాభాలను నమోదు చేస్తుందని, దాని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరపు తుది డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీకి రూ. 14.25ను అందిస్తున్నట్టు ఫలితాలను ఆమోదించిన వేళ, బోర్డు డైరెక్టర్లు తెలిపారు. మేనేజ్ మెంట్ మార్పులకూ ఆమోదం తెలుపుతూ మోహిత్ జోషి, రవి కుమార్, సందీప్ దడ్లానీలను వారి విభాగాల్లో ప్రెసిడెంట్లుగా నియమిస్తున్నామని, ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఇన్ఫోసిస్ వెల్లడించింది.

More Telugu News