: ఫోర్బ్స్‘పవర్ ఫుల్ బిజినెస్ లేడీస్’ జాబితాలో ‘టాప్’ లేపిన నీతా అంబానీ

ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసిన ఆసియా ప్రాంత శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ సత్తా చాటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందా కొచ్చార్ లను వెనక్కు నెట్టేసిన నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. మొన్నటిదాకా భర్త ముఖేశ్ అంబానీ వెనుకే నిలబడి కనిపించిన నీతా అంబానీ, ఇటీవల కంపెనీ వ్యవహారాలకు సంబంధించి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆసియా ప్రాంత శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ ప్రకటించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్న నీతా అంబానీ, కంపెనీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనప్పటికీ... కంపెనీ ఉద్యోగులంతా ఆమెను తమ భవిష్యత్తు బాస్ గానే పరిగణిస్తున్నారని ఫోర్బ్స్ పేర్కొంది. మొత్తం 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలతో రూపొందిన ఈ జాబితాలో భారత్ కు చెందిన 8 మంది మహిళలకు చోటు లభించింది. జాబితా రెండో స్థానంలో ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ఉండగా, మ్యూ సిగ్మా సీఈఓ అంబిగా ధీరజ్ (14 స్థానం), వెల్ స్పన్ ఇండియా సీఈఓ దీపాలీ గోయెంకా (16), లుపిన్ సీఈఓ వినితా గుప్తా (18), ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ చందా కొచ్చార్ (22), వీఎల్ సీసీ హెల్త్ కేర్ వ్యవస్థాపకురాలు వందనా లూత్రా (26), బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా (28) ఈ జాబితాలో ఉన్నారు.

More Telugu News