: యాపిల్ 'మాస్టర్ ప్లాన్'కు గండికొట్టిన భారత ఐటీ డిపార్ట్ మెంట్!

అపరిమితమైన భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరింత వాటాను నమోదు చేయాలన్న లక్ష్యంతో యాపిల్ సంస్థ వేసుకున్న మాస్టర్ ప్లాన్ కు చుక్కెదురైంది. స్మార్ట్ ఫోన్ విభాగంలో సెకండ్ హ్యాండ్ యాపిల్ ఫోన్ల విక్రయాలు మొదలు పెట్టాలని భావిస్తూ, ఆ సంస్థ కేంద్రాన్ని అనుమతి కోరగా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్డుకుంది. వివిధ దేశాల్లో చెత్త కింద పారేసిన ఫోన్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తే, దేశంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరిగిపోతుందని, ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలిపింది. ఒకళ్లు వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకుని వాటిని మరొకరికి విక్రయించేందుకు అనుమతించవద్దని పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫార్సులు పంపింది. "వివిధ రకాల ఎలక్ట్రానిక్ విడిభాగాలను దిగుమతి చేసుకోవం వరకూ అనుమతిస్తాం. వాటిని ఓ క్రమంలో అమర్చి ఎగుమతి చేసుకునే సంస్థలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయి. అంతేకానీ, వాడి పక్కనపెట్టిన వాటిని తెచ్చి ఇక్కడ అమ్ముతామంటే ఒప్పుకోబోము" అని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఓ వైపు యాపిల్ సంస్థ ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటరును ప్రారంభించి, భారీగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సిఫార్సులు రావడం గమనార్హం. కాగా, గత సంవత్సరంలో యాపిల్ సంస్థ 20 లక్షల స్మార్ట్ ఫోన్లను విక్రయించింది.

More Telugu News