: ఒక్క ఐ ఫోన్ ను హ్యాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'సెల్లీబ్రైట్'!

అమెరికన్ కోర్టు చెప్పినప్పటికీ, శాన్ బెర్నార్డినోలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐ ఫోన్ ను అన్ లాక్ చేసేందుకు యాపిల్ నిరాకరించిన వేళ, ఆ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు సహకరించిన ఇజ్రాయిల్ సంస్థ 'సెల్లీబ్రైట్', ఇప్పుడు టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇజ్రాయిల్ లో టెక్నాలజీ రంగం ఎంతగా విస్తరించిందో ఈ సంఘటన తెలియజేస్తోంది. వాస్తవానికి యాపిల్ ఫోన్లను హ్యాక్ చేయాలంటే, అదేమంత సులభం కాదు. తప్పుడు కోడ్ ను నొక్కుతూ వెళితే, పన్నెండు సార్ల తరువాత, అందులోని సమాచారమంతా దానంతట అదే తుడిచిపెట్టుకుని పోతుంది. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ లోని సమాచారం కోసం యూఎస్ ఎఫ్బీఐ పలుమార్లు యాపిల్ కు విన్నవించినా ఫలితం రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందుకు వచ్చిన సెల్లీబ్రైట్, ఎఫ్బీఐకి సహకరించి, ఫోన్ సెక్యూరిటీ వ్యవస్థను ఛేదించింది. ఇప్పుడు ఇదే తరహా కేసుల్లో ఫోన్ల కోడ్ ను ఛేదించేందుకు యత్నిస్తున్న పలు దేశాల పోలీసు అధికారులు సెల్లీబ్రైట్ ను సంప్రదిస్తున్నారు. వీరు ఎలా ఫోన్ ను హ్యాక్ చేశారన్న విషయమై మరింత సమాచారాన్ని తెలుసుకొంటున్నామని యాపిల్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో తమ కస్టమర్ల ప్రయోజనాల మేరకు మరింత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తామని వివరించారు. కాగా, వివిధ దేశాల మీడియా సంధిస్తున్న ప్రశ్నలకు సెల్లీబ్రైట్ అధికారులు స్పందించలేదు. అయితే, సెల్లీబ్రైట్ యాపిల్ ఫోన్ ను హ్యాక్ చేసిందని తాను నమ్ముతున్నట్టు ఇజ్రాయిల్ ఎక్స్ పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇనిస్టిట్యూట్, సైబర్ సెక్యూరిటీ విభాగం మేనేజర్ అచియమ్ ఆల్టర్ వ్యాఖ్యానించారు.

More Telugu News