: జట్టు ఓడినా... గేల్ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు టీమిండియాను చిత్తు చేసింది. ఈ ఒక్క ఫలితంతో అప్పటిదాకా టైటిల్ పోరు కోసం ఉవ్విళ్లూరుతున్న టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ పై అంతగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అసాధారణ ప్రతిభతో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా, అతడు రికార్డులు సాధించిన మ్యాచ్ లో మాత్రం నెగ్గలేకపోయింది. వెస్టిండీస్ జట్టు చేతిలో తన జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసినా... కోహ్లి మాత్రం విన్నింగ్ జట్టు పించ్ హిట్టర్ క్రిస్ గేల్ రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు. టీ20ల్లో అతి తక్కువ మ్యాచ్ ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్ గా క్రిస్ గేల్ (49 మ్యాచ్ ల్లో 15) రికార్డులకెక్కాడు. అతడి తర్వాతి స్థానంలో కివీస్ మాజీ సంచలనం బ్రెండన్ మెక్ కల్లమ్ (71 మ్యాచ్ ల్లో 15) ఉన్నాడు. వీరిద్దరి రికార్డును ఇదివరకే సమం చేసిన కోహ్లీ నిన్నటి మ్యాచ్ తో ఈ రికార్డులను చెరిపేశాడు. ఇప్పటిదాకా 43 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ... 16 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

More Telugu News