: చెలరేగిన కోహ్లీ, రోహిత్, రహానే...ఇక మిగిలింది బౌలర్ల పనే!

టీమిండియా బ్యాట్స్ మన్ తొలిసారి విజయానికి అవసరమైన పరుగులు సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు అజింక్యా రహానే (40), రోహిత్ శర్మ (43) జోడీ శుభారంభం ఇచ్చింది. ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ వికెట్ల ముందు శామ్యూల్ బాద్రీ వేసిన అద్భుమైన బంతికి దొరికిపోయాడు. దీంతో కోహ్లీ (89) క్రీజులోకి వచ్చాడు. రోహిత్ అవుట్ కావడంతో అంతవరకు అతనికి సహకరిస్తూ నెమ్మదిగా ఆడిన రహానే కోహ్లీ వచ్చాక జోరందుకున్నాడు. భారీ షాట్లకు ప్రయత్నిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి జతగా కోహ్లీ కూడా పరుగులు సాధించాడు. ఇద్దరూ మంచి లయను దొరకబుచ్చుకున్న క్రమంలో, బౌండరీ లైన్ వద్ద బ్రావో పట్టిన అద్భుతమైన క్యాచ్ తో రహానే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులో వచ్చిన ధోనీ (15)ని అండగా చేసుకున్న కోహ్లీ చెలరేగిపోయాడు. సింగిల్స్ ను డబుల్స్ గా మార్చుతూ వారిద్దరూ పరుగులు దోచుకున్న విధానం క్రీడా పండితులను మెప్పించగా, అభిమానులను ఉర్రూతలూగించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 192 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రస్సెల్, బాద్రీ చెరో వికెట్ తీసి రాణించారు. కాసేపట్లో వెస్టిండీస్ జట్టు 193 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా, బ్యాట్స్ మన్ చేయాల్సిన పని చేశారు. ఇక మిగిలింది బౌలర్ల పనే...విండీస్ ఆటగాళ్లను కట్టడి చేయగలిగితే టీమిండియా ఫైనల్ కు చేరినట్టే.

More Telugu News