: టీ20 వరల్డ్ కప్ టైటిల్ పోరుకు ఇంగ్లాండ్!... కివీస్ పై ఏకపక్ష విజయం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టైటిల్ పోరుకు ఇంగ్లాండ్ జట్టు బెర్తు ఖరారు చేసుకుంది. నిన్న రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టు న్యూజిల్యాండ్ పై ఏకపక్ష విజయాన్ని సాధించి టైటిల్ పోరుకు రెడీ అయిపోయింది. నేటి రాత్రి టీమిండియా, వెస్టిండీస్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టుతో ఇంగ్లాండ్ జట్టు తలపడనుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ కు ప్రత్యర్థి జట్టు న్యూజిల్యాండ్ ను ఆహ్వానించింది. ఈ క్రమంలో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్... ఆ తర్వాత కష్టాల్లో పడింది. మొత్తం మీద 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆది నుంచే అటాక్ ప్రారంభించింది. ఓవర్ కు పది కంటే ఎక్కువ రన్ రేటుతో విరుచుకుపడ్డ ఆ జట్టు 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్... కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 44 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో అతడు ఏకంగా 78 పరుగులు సాధించాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయినప్పటికీ మిగిలిన బ్యాట్స్ మన్ రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఇంగ్లాండ్ పకడ్బందీ ప్రణాళికతో సత్తా చాటడంతో లీగ్ దశలో ఓటమే ఎరుగని కివీస్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది.

More Telugu News