: రేపు గెలిచి, నిలిచేదెవరు?...ఇద్దరూ వీరులే!

ముంబైలో ఉత్కంఠ పోరుకు టీమిండియా-వెస్టిండీస్ సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం రెండు జట్లు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఐపీఎల్ లో మెజారిటీ ఆటగాళ్లు ఆడుతుండడంతో వారి బలాలు, బలహీనతలు ఇరు జట్ల ఆటగాళ్లకూ బాగా తెలుసు. దీంతో ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు జట్లలోను గొప్ప ఆటగాళ్లు ఎంత మంది ఉన్నప్పటికీ యుద్ధం మాత్రం ప్రధానంగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ మధ్యే నెలకొంటుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో విండీస్ స్టార్ బ్యాట్స్ మన్ గేల్ కు అడ్డుకట్ట వేసే బాధ్యతను అశ్విన్, జడేజాకు అప్పగించనున్నాడు ధోనీ. బంతి వేయడంలో ఏమాత్రం లయతప్పినా అదెళ్లి స్టాండ్స్ లో పడుతుందన్న సంగతి తెలిసిన అశ్విన్, జడేజాలు అతనికి ముకుతాడు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదే సమయంలో లెగ్ సైడ్ షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడంలో కోహ్లీ బలం తెలిసిన విండీస్ ఆటగాళ్లు అతని బలహీనతపై దృష్టిసారించారు. తమ బౌలర్లు ఏమాత్రం తప్పు చేసినా మ్యాచ్ ను కోహ్లీ అమాంతం లాగేసుకుంటాడని కెప్టెన్ సమీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కెప్టెన్ సమీ స్వతహాగా బౌలర్ కావడంతో కోహ్లీకి ముకుతాడు వేసే బాధ్యతను తానే తీసుకుంటున్నాడు. ఇలా గేల్, కోహ్లీ లపై ప్రధానంగా దృష్టిపెట్టిన రెండు జట్ల ఆటగాళ్లు ఇతరులను కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు.

More Telugu News