: ఆ 11 బంతులు ఎందుకు అంత ప్రత్యేకమైనవంటే...!

టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొన్న ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ పై ఆసియా నుంచి ఆఫ్రికా వరకు, ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ ఇన్నింగ్స్ అంత ప్రత్యేకమైనదా? అంటే అవుననే దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఆ ఇన్నింగ్స్ ఎందుకు అంత ప్రత్యేకమైనదంటే...భారత జట్టు కంటే పటిష్ఠమైన పేస్ బౌలింగ్ వనరులు కలిగిన ఆస్ట్రేలియా జట్టు బరిలో ఉంది. బ్యాటింగ్ పిచ్ కూడా కాదు. బంతి ఎక్కడ పడి ఎటు తిరుగుతుందో తెలియదు. అదంతా ఒక ఎత్తైతే, అంతకు ముందు అదే పిచ్ పై బ్యాటింగ్ కు దిగిన టాప్ క్లాస్ క్రికెటర్లు పది మంది విఫలమయ్యారు. అలాటి పిచ్ పై, పటిష్ఠమైన ప్రత్యర్థితో తలపడడం ఒక ఎత్తేతై...40 బంతుల్లో 50 పరుగులు సాధించిన కోహ్లీ ఆ తరువాత ఆడిన 11 బంతుల ఇన్నింగ్స్ మరింత ప్రత్యేకమైనది. 18 బంతుల్లో 39 పరుగులు కావాలి. కోహ్లీ 18 లేదా 19వ ఓవర్ లో అవుటైతే భారత్ గెలిచిన సందర్భం లేదన్న సెంటిమెంట్ ఒకటి ఉంది. ఈ దశలో కోహ్లీపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఈ దశలో ఫాల్కనర్, కౌల్టర్ నైల్ సంధించిన యార్కర్, ఓవర్ పిచ్, ర్యాలీ, ఆన్ రైజ్... ఇలా బంతి ఏదైనా కోహ్లీ చెప్పిన సమాధానం ఒక్కటే...బౌండరీ. ఇక జేమ్స్ ఫాల్కనర్ అమ్ములపొదిలోంచి తీసి సంధించిన స్లోబాల్ ను కోహ్లీ లాంగాఫ్ మీదుగా సంధించిన సిక్సర్ మ్యాచ్ కు హైలైట్ గా నిలిచింది. బాడీ, కళ్లు, పాదాలు, మణికట్టు, బ్యాట్ పట్టుకున్న విధానం, మెదడు పని చేసిన తీరు... ఇలా ఏది చూసినా అతను ఆడిన షాట్లు అనితరసాధ్యం. అందుకే ఈ ఇన్నింగ్స్ ను అత్యంత అమూల్యమైన పెద్దబాలశిక్షతో పోల్చవచ్చు. క్రికెట్ తరాలు ఎన్ని వచ్చినా ఈ ఇన్నింగ్స్ ను ఉదాహరణగా చూపించవచ్చు. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ పండితులు రెండు రోజులపాటు ప్రశంసల్లో ముంచెత్తారు.

More Telugu News