: కివీస్ చేతిలో పాక్ చిత్తు!... మెగా టోర్నీ నుంచి ఔటేనా?

బరిలో కొనసాగాలంటే, గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు బొక్క బోర్లా పడింది. ఫలితంగా ఐసీసీ టీ20 మెగా టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. నిన్న మొహాలీ కేంద్రంగా జరిగిన మ్యాచ్ లో అఫ్రీది సేన న్యూజిల్యాండ్ జట్టు చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ తర్వాత 181 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకుని కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(47), అహ్మద్ షెహజాద్ (30) శుభారంభాన్ని ఇచ్చినా దానిని మిగతా బ్యాట్స్ మెన్ కొనసాగించలేకపోయారు. మెరుపులు మెరిపిస్తాడునుకున్న కెప్టెన్ షాహిద్ అఫ్రీది (19) కూడా చేతులెత్తేశాడు. వెరసి పాక్ జట్టు కివీస్ జట్టు చేతిలో 22 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ జట్టు ఇక మెగా టోర్నీ నుంచి దాదాపుగా తప్పుకునే ప్రమాదంలో పడింది. లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా పాక్ జట్టు ఈ నెల 26న మొహాలీలోనే ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధిస్తే తప్పించి పాక్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండవు.

More Telugu News