: రుణాలు, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తానని మాల్యా ఆఫర్!

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయి పడి విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా, ఆ రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఓ ప్లాన్ ను అందించగా, దాన్ని బ్యాంకులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు అంగీకరించేలా ఓ సరికొత్త ప్రణాళికతో ఆయన రానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఓ న్యాయ సేవల సంస్థ సేవలను పొందుతున్నారని, ఆయన పూర్తి ఆస్తుల వివరాలు, చెల్లించాల్సిన రుణాలు, ఉద్యోగుల బకాయిలపై వివరాలను క్రోడీకరిస్తున్నారని మాల్యా దగ్గరి వ్యక్తి ఒకరు తెలిపారు. ఓ వ్యాపారవేత్తగా, ఉద్యోగుల సంక్షేమం ఆయనకు అత్యంత ప్రాధాన్యతాంశమని, వారికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలనూ తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2012లో మూతపడినప్పటి నుంచి ఉద్యోగుల బకాయిలు పేరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులతో పాటు బ్యాంకు రుణాలనూ వన్ టైం సెటిల్ మెంట్ కింద చెల్లించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ క్రికెట్ టీములు, ఫార్ములా వన్ టీముల యజమానిగా ఉన్న ఆయన, భారత్ కు శాశ్వతంగా దూరం కావాలని ఎంతమాత్రమూ భావించడం లేదని, తన పేరు తిరిగి ఇండియాలో వినిపించాలని ఆయన కోరుకుంటున్నారని మాల్యాకు దగ్గరగా మెసిలే వ్యక్తి ఒకరు తెలిపారు. కాగా, తానేమీ తప్పు చేయలేదని, భారత న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని మాల్యా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, తీసుకున్న అసలు మొత్తం ఏకమొత్తంలో చెల్లించే పక్షంలో తాము అంగీకరించే అవకాశాలను పరిశీలిస్తామని ఓ బ్యాంకు అధికారి వ్యాఖ్యానించారు. ఆయన ఎటువంటి ప్లాన్ తో వస్తారో చూసిన తరువాతే దీనిపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు. మాల్యా చెల్లించాల్సిన మొత్తంలో వడ్డీ రూ. 3 వేల కోట్లకు పైగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే దాదాపు ఓ రూ. 6 వేల కోట్లు సమీకరించగలిగితే, వన్ టైం సెటిల్ మెంటుకు ఆయన ముందుకు రావచ్చు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు వద్ద జూలై 2013 నుంచి రూ. 600 కోట్లు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. 2014 ఆరంభంలో యూబీ గ్రూపునకు చెందిన రూ. 650 కోట్లు బ్యాంకు ఖాతాల్లో సీజ్ చేయబడ్డాయి. ఇక మాల్యా మరో రూ. 4,800 కోట్లు చూసుకుంటే, వన్ టైం సెటిల్ మెంట్ సులువు అవుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News