: ప్రపంచ వేదికపై భారత్ ను గెలవలేకపోతున్న పాక్... కారణాలు చెబుతున్న గవాస్కర్, సంగక్కార!

నిన్నటి హై ప్రొఫైల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన తరువాత క్రికెట్ వర్గాల్లో, ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు వీరాభిమానుల్లో మరోసారి మెదిలిన ఏకైక ప్రశ్న... వరల్డ్ కప్ పోటీల్లో భారత్ పై పాకిస్థాన్ గెలవలేదా? అని. విరాట్ కోహ్లీ అద్భుత రీతిలో చేసిన 55 పరుగులు సంఖ్య పరంగా పెద్దమొత్తం కాకపోయినా, జట్టు విజయానికి కారణమైంది. ఈ మ్యాచ్ తో 11 వరల్డ్ కప్ పోటీల్లో ఇండియా చేతిలో పాక్ ఓడిపోయినట్లయింది. ఇక భారత్ విజయాన్ని మాజీ క్రికెటర్లు సంగక్కార, గవాస్కర్ సమీక్షించారు. "ఓ పెద్ద టోర్నమెంటును భారత జట్టు ఎంతో నియంత్రణతో ఆడింది. ఆటగాళ్లను జట్టు మేనేజ్ మెంటు నమ్మింది. ఆ జట్టు ఎంతో నమ్మకంగా కనిపించింది. ఇక పాక్ జట్టు విషయానికి వస్తే, వారు ఎంతో వివాదం తరువాత పోటీలకు వచ్చారు. టీం సెలక్షన్ లోనూ వివాదాలు నెలకొన్నాయి. మేనేజ్ మెంటూ అలానే ఉంది. ఇన్ని సమస్యల మధ్య భారత్ వంటి జట్టును గెలవడం ఎంతో కష్టం" అని సంగక్కార వ్యాఖ్యానించాడు. "పాక్ తో పోలిస్తే, భారత జట్టు బాగా ఆడింది. పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్ అంతమాత్రం స్కోరును సాధించకుంటే, 100 పరుగులు కూడా జమ అయ్యేవి కాదు. ఇక పాక్ తో వరల్డ్ కప్ పోటీ అంటే, సాధారణంగానే భారత ఆటగాళ్లు ఇంకాస్త ఎక్కువ కష్టపడతారు. నిన్నటి మ్యాచ్ లో పాక్ ఆ పని చేయలేకపోయింది" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

More Telugu News