: అక్రమార్జనను ‘సాగు ఆదాయం’గా చూపడం ఇకపై కష్టమే!

సాగు ఆదాయంపై దేశంలో పన్ను మినహాయింపు ఉంది. ఇదే కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. వివిధ మార్గాల్లో అక్రమార్జనను పోగేస్తున్న కొందరు వ్యక్తులు... తమ ఆదాయాన్ని వ్యవసాయంలో వచ్చిన ఆదాయంగా చూపుతూ ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారు. అంతేకాకుండా తాము కూడబెట్టిన ‘బ్లాక్ మనీ’ని రాజమార్గంలో ‘వైట్’ చేసుకుంటున్నారు. ఇకపై ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడే వారు విషమ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఈ దిశగా ఆదాయపన్ను శాఖ కసరత్తు చేస్తోంది. పాట్నా హైకోర్టు ఆదేశాలలో అసలు గుట్టును అర్థం చేసుకున్న ఆ శాఖ అధికారులు ప్రస్తుతం ‘సాగు కోటీశ్వరులు’గా వినుతికెక్కిన పలువురికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమార్జనను సాగు ఆదాయంగా చూపుతూ పలువురు వ్యక్తులు కోట్లకు పడగలెత్తుతున్నారన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన పాట్నా హైకోర్టు... వారి ఆదాయంపై ఓ కన్నేయాలని ఐటీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాల్లో సాగు ఆదాయాన్ని రూ.కోటికి పైగా చూపిన వారికి నోటీసులు జారీ చేసేందుకు ఆదాయపన్ను శాఖ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దేశంలో సాగు ఆదాయాన్ని రూ. కోటికి పైగా చూపుతున్న సంస్థలు, వ్యక్తులు ఏకంగా 2,746 మంది ఉన్నారట. వీరందరి ఆదాయాలపైనా ఐటీ శాఖ దృష్టి సారించనుంది.

More Telugu News