: బెంగళూరు టెక్కీ కనుగొన్న ఫేస్ బుక్ బగ్ ఇదే!

బెంగళూరుకు చెందిన టెక్కీ ఆనంద్ ప్రకాష్ ఫేస్ బుక్ లాగిన్ వ్యవస్థలో నెలకొన్న ఓ బగ్ ను కనుగొని దాని వివరాలను వెల్లడించినందుకుగాను రూ. 10 లక్షల బహుమతిని పొందిన సంగతి తెలిసిందే. తను కనుగొన్న బగ్ వివరాలను ప్రకాష్, పోస్ట్ చేశాడు. దాని వివరాలివి... ఓ యూజర్ తన ఫేస్ బుక్ ఖాతా పాస్ వర్డ్ ను మరిచిపోయినప్పుడు దాన్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. తన ఫోన్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీకి ఆరంకెల కోడ్ ను రిక్వెస్ట్ చేసి, దాన్ని పేజీలో ఎంటర్ చేయడం ద్వారా కొత్త పాస్ వర్డ్ ను నమోదు చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఖాతాలో పాస్ వర్డ్ మరచిపోయామని వెల్లడించి, ఆపై తప్పుడు ఆరంకెల కోడ్ ను ఎంటర్ చేస్తుంటే 10 నుంచి 12 సార్ల తరువాత ఖాతా బ్లాక్ అవుతుంది. ప్రకాష్ బుర్ర ఇక్కడే పనిచేసింది. వాస్తవానికి వేర్వేరు మిర్రర్ సైట్ల ద్వారా ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 'బీటా డాట్ ఫేస్ బుక్', 'టచ్ డాట్ ఫేస్ బుక్', 'ఎంబేసిక్స్ డాట్ బీటా డాట్ ఫేస్ బుక్', 'మొబైల్ డాట్ ఫేస్ బుక్' వంటి సైట్ల నుంచి కూడా ఫేస్ బుక్ కు లాగినై పోస్టులు చూడవచ్చు, డిలీట్ చేయవచ్చు, మార్చవచ్చు. ప్రధాన వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ఖాతా బ్లాక్ అయిన తరువాత, ఈ మిర్రర్ సైట్ల ద్వారా లాగిన్ కావచ్చని ప్రకాష్ కనుగొన్నాడు. ఇక్కడ పాస్ వర్డ్ మరచిపోయిన తరువాత ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నామన్న విషయమై కంట్రోల్ లేదు. బ్లాక్ అయిన తన ఖాతాను, విజయవంతంగా తెరచి మరీ కొత్త పాస్ వర్డ్ ను ప్రకాష్ పెట్టుకోగలిగాడు. దీని గురించి వెల్లడించిన తరువాతనే సంస్థ భారీ ప్రోత్సాహక పరిహారాన్ని ప్రకటించింది. ఇక ఈ బగ్ ను తొలగించే చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కాగా, 2015 సంవత్సరంలో 210 మంది యూజర్లు ఫేస్ బుక్ లోని వందలాది బగ్స్ కనుగొని వాటిని వెల్లడించగా, సంస్థ 9.36 లక్షల డాలర్లను వారికి బహుమతిగా అందించింది.

More Telugu News