: లిక్కర్ కింగ్ కు షాకిచ్చిన ఈడీ!... మనీ ల్యాండరింగ్ కింద కేసు నమోదు

మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి 7000 కోట్ల రూపాయల రుణాలను తీసుకున్న మాల్యా... పౌరవిమానయాన రంగంలో ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్’ పేరిట గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే లిక్కర్ వ్యాపారంలో విజయవంతమైన మాల్యా, పౌరవిమానయానంలో మాత్రం రాణించలేకపోయారు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆయన ఎయిర్ లైన్స్ వ్యాపారాన్ని మూసేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలతో బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాల్యా చెల్లించలేదు. అయితే తన ఆధ్వర్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను బ్రిటన్ కంపెనీ డియాజియోకు అమ్మేసిన మాల్యా, డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుని రూ.515 కోట్లను గుడ్ విల్ గా తీసుకుంటున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్బీఐ... సదరు గుడ్ విల్ పై తనకే హక్కు దక్కాలని బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేటి ఉదయం విచారణ చేపట్టిన ట్రైబ్యునల్... ఇరు పక్షాల వాదనలను విని, తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఈ సమయంలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఐడీబీఐ బ్యాంకు నుంచి 900 కోట్ల ఋణం ఎగవేసిన వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాపై ఈడీ తాజాగా కేసు నమోదు చేసింది. త్వరలోనే విచారణకు హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ చేసేందుకు ఈడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

More Telugu News