: వ్యక్తిగతంగా రుణగ్రహీతనే కాను... ఇక డిఫాల్టర్ ను ఎలా అవుతా?: లిక్కర్ కింగ్ మాల్యా సంచలన ప్రకటన

బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బాకీ పడ్డ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యున్ (డీఆర్టీ) రేపు కీలక నిర్ణయాన్ని వెలువరించనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరిట వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకున్న మాల్యా, వాటిని తీర్చకపోగా... కంపెనీలను అమ్ముకుని లండన్ చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవడంతో పాటు అరెస్ట్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల డీఆర్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రేపు డీఆర్టీ విచారణ చేపట్టనుంది. ఈ కీలక సమయంలో నిన్న మాల్యా ఓ సంచలన ప్రకటనను విడుదల చేశారు. అసలు తాను వ్యక్తిగతంగా రుణ గ్రహీతనే కాదంటూ ఆయన విడుదల చేసిన ప్రకటన మార్కెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. రుణ గ్రహీతను కాని తాను డిఫాల్టర్ (ఎగవేతదారు)ను ఎలా అవుతానంటూ మాల్యా చేసిన ప్రకటన పెను సంచలనం రేపుతోంది. డీఆర్టీ కోర్టు తీర్పును ప్రభావితం చేసేందుకే మాల్యా సదరు ప్రకటనను జారీ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News