: 'లిక్కర్ కింగ్'కు మరింత కష్టం... యూబీ గ్రూప్ దివాలా!

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నియంత్రణలో ఉన్న యూబీ హోల్డింగ్స్ సంస్థను డిఫాల్టర్ గా ప్రకటిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. దీని ప్రభావంతో యూబీ హోల్డింగ్స్ ఈక్విటీ వాటా విలువ ఏకంగా 10 శాతం పడిపోయింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు రుణాలిచ్చిన వ్యవహారంలో యూబీ హోల్డింగ్స్ గ్యారంటీ ఇవ్వడం, ఆపై కింగ్ ఫిషర్ పతనం తరువాత రుణాలను తిరిగి చెల్లించడంలో యూబీ విఫలమైన సంగతి తెలిసిందే. యూబీ గ్రూప్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 800 కోట్లు రావాల్సి వుండగా, దీన్ని ఎన్పీఏ (నాన్ పెర్ ఫార్మింగ్ అసెట్స్) విభాగంలో చేర్చడంతో గడచిన త్రైమాసికంలో పీఎన్బీ భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. కాగా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నుంచి ఎస్బీఐకి రూ. 1,600 కోట్లు, ఐడీబీఐకి రూ. 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 550 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 430 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 410 కోట్లు, యూకో బ్యాంకుకు రూ. 320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ. 310 కోట్లు రావాల్సివున్నాయి. వీటితో పాటు పలు చిన్న, పెద్ద బ్యాంకులకు రూ. 50 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేరకు బకాయిలు చెల్లించాలి. ఇవన్నీ వెనక్కొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం 17 బ్యాంకుల నుంచి రూ. 7 వేల కోట్లు రుణం రూపంలో కింగ్ ఫిషర్ కు చేరగా, వాటన్నింటికీ యూబీ హోల్డింగ్స్ గ్యారంటర్ గా ఉంది. జనవరి 2012 నుంచి ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రాకపోగా, తాకట్టు పెట్టిన వాటాలను విక్రయించిన బ్యాంకులు రూ. 1,600 కోట్ల వరకూ జమ చేసుకోగలిగాయి. ఇక మిగతా మొత్తం చెల్లించడంలో విఫలమైతే మాల్యా అరెస్టును ఎదుర్కోక తప్పక పోవచ్చని అంచనా.

More Telugu News