: ఆ కుర్రాడు 834 మంది అమ్మాయిలకు వేలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు!

యువత ఘనంగా జరుపుకునే ప్రేమికుల రోజును ఓ యువకుడు వినూత్నంగా జరుపుకుని తన చిరకాల కోరిక తీరిందని ముచ్చటపడిపోయాడు. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లోని స్మిత్ ఫీల్డ్ లోని ఓ పాఠశాలలో చదువుతున్న హేడెన్ గాడ్ ఫ్రే అనే యువకుడు 14 ఏళ్ల వయసులో ఉండగా స్కూల్లో ఉన్న అమ్మాయిలందరికీ వేలంటైన్స్ డే గిఫ్ట్ గా పూలను బహూకరించాలనే ఆలోచన వచ్చింది. అందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి మూడేళ్ల పాటు వివిధ పనులు చేశాడు. మెక్ డోనల్డ్స్ లో వంటవాడిగా పని చేశాడు. గత పది నెలలుగా మెక్సికన్ రెస్టారెంట్లో అంట్లు తోమాడు. ఎలా అయితేనేమి, తాను అనుకున్న 450 డాలర్లు (30 వేల రూపాయలు) పోగు చేశాడు. వేలంటైన్స్ డే రావడంతో ఆ మొత్తం ఖర్చు చేసి ఖరీదైన గులాబీలను తెప్పించాడు. స్కూల్ లోని 12 మంది స్నేహితుల సాయంతో వాటన్నింటినీ సమానంగా కత్తించాడు. స్నేహితులనే వాలంటీర్లుగా చేసుకుని ఆరోజు స్కూల్ కు వచ్చిన ప్రతి అమ్మాయికి ఒక గులాబీని కానుకగా అందజేశాడు. ఇలా 834 మంది అమ్మాయిలకు ప్రేమగా పూలు ఇచ్చాడు. దీనిపై హేడెన్ గర్ల్ ఫ్రెండ్ లిలియాన్ షార్ప్ మాట్లాడుతూ, ఈ రోజు స్కూలుకి వచ్చిన ప్రతి అమ్మాయి గులాబీ పట్టుకుని ఆనందంగా ఇంటికి వెళ్లిందని తెలిపింది. ఇది తనకు చాలా నచ్చిందని పేర్కొంది. మొత్తానికి హేడెన్ గాడ్ ఫ్రే తన చిరకాల కోరికను తీర్చుకోవడమే కాకుండా ప్రియురాలి మనసు కూడా గెల్చుకున్నాడు.

More Telugu News